అలాంటివారిని బహిరంగంగా, బహు కఠినంగా శిక్షించాలి…
మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అన్నారు మన పెద్దలు. అంటే తల్లిదండ్రుల తరువాత అంతటి పవిత్ర స్థానం గురువులది అని దానర్ధం. మరి అలాంటి స్థానంలో ఉండి పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువులు, కీచకులుగా మారి అసభ్యకరమైన పనులతో గురువుల మీద విద్యార్ధులకి గౌరవం పోయే విధంగా ప్రవర్తించడం విచారకరం. సమాజం సిగ్గుతో తలవంచుకునే దౌర్భాగ్యపు స్థితికి నేడు మనం చేరుకున్నాం. ఇటీవల ఒక స్కూల్లో ప్రిన్సిపాల్ గా ఉన్న ఒక వ్యక్తి విద్యార్ధినులకి మత్తు మందు ఇచ్చి,ఆ తరువాత బెదిరించి లోబరుచుకోవడం అనే దుశ్చర్యలకు పాల్పడ్డాడు అన్నది మనం చూశాము.ఇలాంటి నీచులకు పొరుగు దేశాల్లోలాగా బహిరంగంగా శిక్షిస్తేనే కానీ బుద్ధి రాదు. మన ప్రభుత్వం కూడా ఇలాంటి వాళ్ళ విషయాల్లో ఎందుకు ఉపేక్షిస్తోందో తెలియని స్థితి. అమాయకపు ఆడపిల్లల జీవితాలతో ఇలా ఆడుకుని, అభం శుభం తెలియని వారి బ్రతుకులను నాశనం చేసే అలాంటి కసాయి గురువులను కఠినంగా శిక్షించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇలాంటి వారి మీద కేసులు పెట్టి కోర్టుల చుట్టూ నెలల తరబడి తిప్పే పద్ధతులకు స్వస్తి పలకకపోతే, రోజుకి ఒక కొత్త “కీచక” ఉదంతం చోటుచేసుకుంటూనే ఉంటుంది. మన చట్టాల్లో సవరణలు తేకపోతే , ఆడవాళ్ళ కన్నుల్లో తడి మరి ఎప్పటికీ ఆరదు. ఈ “దుశ్శాశన పర్వం” ఇక ఎన్నటికీ ఆగదు.
ఇలాంటి తప్పు ఎప్పుడు-ఎక్కడ జరిగినా తక్షణమే బాధితులకు న్యాయం చేకూర్చే విధంగా చట్టాలని సవరించాలి. మళ్లీ ఇంకో తప్పు చేయాలన్న ఆలోచన వస్తే చాలు.. మగ “మృగాల” నరాల్లో వణుకు పుట్టాలి. “ప్రేమ” పేరుతో ఎన్ని దురాగతాలు జరిగినా… “కామం” తో కళ్ళు మూసుకుపోయి
“మృగాళ్లు” ఎన్ని పైశాచికత్వాలకు పాల్పడినా, ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవడంలో ఎప్పటికప్పుడు విఫలమవుతూనే ఉంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా… ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఇలాంటి ఉదంతం జరిగినప్పుడు హడావిడి చేసి..తర్వాత నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఇకనైనా.. ప్రభుత్వం మేల్కొని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుని , మన సమాజంలో ఎంతో పవిత్రంగా చూసుకునే “స్త్రీ”కి పరిపూర్ణ రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సున్నితమయిన ఆ ‘ఆడ’ కుసుమాలను నేల రాలనీకుండా జాగ్రత్త వహించాల్సిన ఆవశ్యకత మరెంతైనా ఉంది.