21 Jul 2010

తెలుగువాళ్ళందరూ ఏకమవ్వాల్సిన సమయమిది…


భారతదేశంలో జీవనదులు ఎన్నో ఉన్నాయి. అవి ఏ ఒక్కరి సొత్తు కాదు. ఒక్కో నది కొన్ని రాష్ట్రాల మీదుగా ప్రవహిస్తూ ఉంటుంది. ఏ ఏ రాష్ట్రాల మీదుగా ఒక నది ప్రవహిస్తుందో, ఆ నది మీద అ రాష్ట్రాలన్నిటికీ సమాన హక్కు ఉంటుంది. ఆ నది తాలూకు జలాలను ఏ దామాషాలో ఎవరెవరు ఎలా వాడుకోవాలి అన్న దానికి కొన్ని లెక్కలున్నాయి. “సెంట్రల్ వాటర్ కమిషన్” అనేది ఒకటుంది. దీని ద్వారా ఆ నది తాలూకు నీటిని ఎలా వాడుకోవాలో నిర్ణయించడం జరుగుతుంది. దాని ప్రకారమే నడుచుకోవాలి కానీ, ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఆనకట్టలు కట్టేసుకుని, తమ అవసరాలన్నిటినీ తీర్చుకున్నాక దిగువ రాష్ట్రాలకు నీటిని వదులుతాము అనడం సమంజసం కాదు. కానీ దురదృష్టవశాత్తూ ఇప్పుడదే జరుగుతోంది. ప్రస్తుతం గోదావరి నది మీద ఉన్న అనకట్టలను చూసుకున్నట్టైతే, మహారాష్ట్రలో ఇష్టం వచ్చినట్టు ఆనకట్టలు కట్టేసుకుని, వాళ్ళ అవసరాలు తీరిపోయినాక మిగులు నీటిని మనకు వదులుతున్నారు. వర్షాలు బాగా పడితే గొడవ లేదు. కానీ వర్షాపాతం లేని రోజున పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఆ నీటి మీద ఆశలు పెట్టుకున్న రైతులకు  నిరాశే మిగులుతోంది.

ఇప్పుడు తాజాగా బాబ్లీ సమస్య కూడా అందుకే జటిలమైంది.. ఎప్పుడు మనవాళ్ళు వాళ్ళని  అడిగినా మేము ప్రాజెక్ట్ కట్టటంలేదు అని బుకాయిస్తూ వచ్చి , దాదాపు ఆ ప్రాజెక్ట్ ని ప్రస్తుతం వాళ్ళు  పూర్తిచేసుకున్నారు. ఆ ప్రాజెక్ట్ అంతు తేల్చాలనే ఉద్దేశంతో ,ప్రత్యక్షంగా అక్కడికి వెళ్లి నిజా నిజాలు నిగ్గు తేల్చి దీనిపైన నివేదికను సెంట్రల్ వాటర్ కమిషన్ కి, మరియు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇవ్వాలనే ఉద్దేశం తో చంద్రబాబునాయుడు గారు  ఆయన బలగాన్నంతా తీసుకుని ఇక్కడినుంచి ప్రత్యేక బస్సులో అక్కడికి బయల్దేరారు. కానీ వీళ్ళని కనీసం మహారాష్ట్ర సరిహద్దులదాకా కూడా వెళ్ళనీయకుండా అక్కడి పోలీసులు అడ్డుకున్నారు. మా స్వంత వాహనాల్లో మిమ్మల్ని తీసుకెళతాం అని మాయమాటలు చెప్పి ఒక ఐ.ఐ.టి. కాలేజి భవనానికి తీసుకెళ్ళి నిర్బంధించి, ఆ తరువాత  మిమ్మల్ని అరెస్టు చేశామని ప్రకటించారు. ఎంత  అమానుషం అది? కనీస సదుపాయాలూ కూడా కల్పించకుండా, వచ్చిన వాళ్ళు ఏ సంఘవిద్రోహ శక్తులో కాదు, కొన్ని లక్షలమంది వోట్లు వేసి గెలిపించుకున్న ప్రజానాయకులు అన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఎంత నీచంగా ప్రవర్తించారు. ఆడా-మగా తేడాలేకుండా  అన్ని గంటలపాటు అలా నిర్బంధించడం  అన్నది ఘోరాతి ఘోరం.

మామూలుగా మనింటికి శతృవులు వచ్చినా, కనీస మర్యాదలు చేసి పంపిస్తాం. అలాంటి సంస్కృతీ సాంప్రదాయాలు కలిగిన మన భారతదేశంలో నేడు ఎలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయో చూస్తుంటే సిగ్గుగా ఉంది. ఒక రాష్ట్రం నుండి వచ్చిన ప్రజా ప్రతినిధులని మరొక రాష్ట్ర ప్రభుత్వం అవమానించిన తీరు గర్హనీయం. దేశానికి స్వాతంత్ర్యం రాక ముందు తెల్లదొరలు కూడా మన స్వాతంత్ర్య సమరయోధులతో ఇంత నీచాతి నీచంగా ప్రవర్తించి ఉండరు. ఆ లాఠీచార్జులేమిటి?ఆ చిత్రహింసలేమిటి? సరైన వసతులు లేక, ఆహార పానీయాలు లేక ఎంత మంది అక్కడ  అవస్థపడ్డారు? కొంతమంది ఆరోగ్యం బాగాలేని వాళ్ళు సమయానికి మందులు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ అక్కడి పరిస్థితుల కారణంగా సమయానికి అవేవీ  లేక, చాలామంది అనారోగ్యం బారినపడ్డారు. ఇటు మన ప్రభుత్వం కూడా దీనిపై స్పందించాల్సిన విధంగా స్పందించలేదు.

తొమ్మిది సంవత్సరాలు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, జాతీయస్థాయిలో రాజకీయంగా చక్రం తిప్పిన వ్యక్తి, ఒక రాష్ట్ర అపోజిషన్ పార్టీ లీడర్ అయిన చంద్రబాబునాయుడు గారితో వాళ్ళు ప్రవర్తించే తీరు ఇదేనా? ప్రధానమంత్రి కావడానికి అన్ని అర్హతలూ , అవకాశం ఉన్నా కూడా వద్దని రాష్ట్ర రాజకీయాలకు అంకితమైన మనిషికి వాళ్ళు ఇచ్చేమర్యాద ఇంతేనా? అటు మహారాష్ట్రలో, ఇటు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండటంతో ఇదంతా వాళ్ళు-వీళ్ళు కుమ్మక్కై కక్ష సాధిస్తున్నారా? ఓ పక్కన అక్కడ అంత దుమారం రేగుతుంటీ, ఇక్కడ మన ప్రభుత్వం కానీ, ప్రజా ప్రతినిధులు కానీ ఎవరూ స్పందించట్లేదు. స్వలాభం, రాజకీయ లబ్ది కోసం ఎవరికి వారు నిమ్మకు నీరెత్తినట్లు మిన్నకుండిపోతున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాజకీయంగా కాకున్నా, కనీసం సాటి తెలుగువాళ్ళకు అవమానం జరిగింది, మన పరువు గోదాట్లో కలిసిపోయిందన్న బాధ కూడా ఎవరికీ లేదు.

గతంలో కూడా ఒకసారి ఇలాగే జరిగినప్పుడు , నందమూరి తారకరామారావు అనే ఒక శక్తి దూసుకొచ్చింది. తెలుగు వాడి “వేడి-వాడి” ఏమిటో కాంగ్రెస్ నాయకులకు రుచి చూపించింది. కనీసం ఇప్పటికైనా కళ్ళు  తెరిచి రాజకీయాలను కాసేపు పక్కనపెట్టి , తెలుగువాళ్లమైనందుకు ఈ దురాగతాన్ని , దాష్టీకాన్ని తీవ్రంగా ఖండించాలని  ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ  ఈ సందర్భంగా  నేను పిలుపునిస్తున్నాను.. విద్యార్ధుల్లో కూడా కదలిక రావాలి. వీలు చూసుకుని ఇలాంటి అన్యాయాల్ని ఎదుర్కోవడం లాంటివి చేయాలి. మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి, చేసిన తప్పుని తెలుసుకుని చంద్రబాబుగారి దగ్గరకొచ్చి అందరిముందు బేషరతుగా క్షమాపణలు  చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతే కాకుండా, మళ్ళీ మనవాళ్ళందరినీ మహారాష్ట్ర ప్రభుత్వం దగ్గరుండి సకల మర్యాదలతో బాబ్లీ ప్రాజెక్ట్ దగ్గరకు తీసుకెళ్ళి, అంతా చూపించి పంపాలి. లేదంటే అంతకు అంత వాళ్ళు అనుభవిస్తారు అని మేము ఖచ్చితంగా చెప్తున్నాం.

Comments are closed.