9 Jun 2010

క్రిష్ కి ‘మా’ అభినందనలు:మురళీమోహన్

ఇటీవలే  విడుదలైన “వేదం” సినిమా సర్వత్రా మంచి టాక్ తెచ్చుకోవడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాం. ఆ చిత్ర దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ(క్రిష్) కు చిత్ర పరిశ్రమ తరఫున, ముఖ్యంగా ‘మా’ మరియు మాస్టార్స్. కామ్ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ రోజు చిత్ర పరిశ్రమకి “వేదం” లాంటి మల్టీ స్టారర్ సినిమాల అవసరం ఎంతైనా ఉంది. గతంలో ఏఎన్నార్, ఎన్టీఆర్ లాంటి పెద్ద హీరోల కాంబినేషన్‌లో ఎన్ని సినిమాలు వచ్చాయో మనందరికీ తెలుసు. ఆ తరువాత, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు లాంటి వాళ్ళ కాంబినేషన్‌లో కూడా చాలానే వచ్చాయి. ఎలాంటి భేషజాలకు పోకుండా, తమ స్టార్ స్టేటస్ లను పక్కనబెట్టి ఒక మంచి సినిమా రావడమ్ కోసం ఎన్నో సినిమాలను వారంతా కలిసిమెలిసి చేశారు. కానీ రాను రాను ఎందుకనో ఆ సంస్కృతి అంతరించిపోయింది.

ఇప్పుడున్న హీరోల్లో చాలా మంది ఆ.. ఇంకొకరితో కలిసి ఎం చేస్తాం.. మన ఇమేజ్ డ్యామేజ్ అవుతుందేమో అన్న భయంతో వెనకడుగు వేస్తున్నారు. ఒకవేళ చేయాల్సి వస్తే మాత్రం నీ పాత్ర ఏంటి,… నా పాత్ర ఏంటి… నీకేన్ని డ్యూయట్లు…నాకేన్ని డ్యూట్లు లాంటి లెక్కలెన్నో వేసుకుంటున్నారు. ఇది చాలా శోచనీయం. అలాంటి వాటిని పక్కనబెట్టి, అంతరించిపోయిన మల్టీ స్టారర్ సాంప్రదాయాన్ని క్రిష్ ఎంతో ధైర్యంగా తెరమీదికి తిరిగి తీసుకొచ్చి, తెలుగు సినిమాకు ప్రాణం పోశాడు. ఆహ్వానించదగ్గ పరిణామం ఇది. తెలుగు సినిమాకు ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో రావాలి. “వేదం” సినిమా ఇప్పటి హీరోలెందరికో దిక్సూచి కావాలి. ప్రముఖ హీరోలు వెంకటేష్, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి ఒక సినిమాలో నటించనున్నారని వార్తలు వినవస్తున్నాయి. అవి నిజం కావాలి… అదే స్పూర్తితో మరెందరో హీరోలు ఒకరితో కలిసి ఒకరు సినిమాలు చేయడానికి ముందుకి రావాలి.

తొలి సినిమా “గమ్యం” తోనే చక్కని ప్రతిభగల దర్శకుడని నిరూపించుకున్న క్రిష్, రెండవ సినిమా “వేదం” తో కూడా తానేమిటో మరో సారి చాటి చెప్పాడు. ఎంతో కష్టపడి క్రిష్ పునఃప్రారంభించిన ఈ పద్ధతికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (‘మా’) మరోసారి తన హర్షం వ్యక్తం చేస్తూ, “వేదం” లాంటి మల్టీ స్టారర్ సినిమాలు త్వరలో మరెన్నో వచ్చి సినీ పరిశ్రమ కళ కళలాడుతూ ఉండాలని మనసారా ఆకాంక్షిస్తోంది.

Comments are closed.