లేచింది మహిళా లోకం: మురళీ మోహన్
గత మే 27వ తారీఖున టాలీవుడ్ క్రికెట్ మ్యాచ్ కి సంబంధించి టీమ్ సెలెక్షన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఏయే ఆర్టిస్టు ఎవరి టీంలో ఆడాలన్న దాని కోసం ప్రత్యక్షంగా మీడియా సమక్షంలో , పరోక్షంగా లైవ్ ప్రోగ్రామ్ ద్వారా ప్రజల సమక్షంలో ఆ కార్యక్రమాన్నివిజయవంతంగా నిర్వహించాం. ఒక్క ఫిర్యాదు కూడా లేకుండా కార్యక్రమం సవ్యంగా సాగిందంటూ అంతా అనుకుంటూ ఉంటే సంతోషంగా అనిపించింది. ఇంతలో యువ కథానాయిక గాయత్రి రావు (హ్యాపీ డేస్ ఫేమ్ అప్పు) వచ్చి… ఎప్పుడూ మగవాళ్లకేనా ఈ ఆటలు, మా ఆడవాళ్ళకేం తక్కువ? మమ్మల్ని ఎందుకు పరిగణ లోకి తీసుకోవడంలేదు అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది..
ఆమె ప్రశ్నలు సమంజసంగానే ఉండటంతో ఒక్కటే చెప్పాను,.. “మీరు వాళ్ళతో కలిసి ఆడటమేమిటి? మీ హీరోయిన్లంతా కలిసి నీ లాగే ముందుకొచ్చి మేము కూడా ఆడతాం అంటే, దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయడానికి మేము కూడా రెడీ. మన మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, హైదరాబాద్ వాసి మిథాలీ రాజ్ నాయకత్వంలో లోగడ ప్రపంచ కప్ కూడా గెలుచుకొచ్చారు. అదే స్పూర్తితో మీరు కూడా ముందుకొస్తే మాకెలాంటి అభ్యంతరం లేదు. మరీ 20-20 క్రికెట్ కాకపోయినా, కనీసం ఓ పది ఓవర్లో, ఐదు ఓవర్లో ఆడేట్టుగా మీరు ప్లాన్ చేసుకుని రండి, ‘మా’ సహకారం మీకు ఎప్పుడూ ఉంటుంది” అని నచ్చజెప్పడం జరిగింది..