12 May 2010
యువరక్తపు వేడి దాసరి “యంగ్ ఇండియా”
ఒకానొకప్పుడు జయప్రద, జయసుధ, శ్రీదేవి, మాధవి లాంటి మన తెలుగు హీరోయిన్లు ఉత్తర భారత దేశానికి వెళ్ళి అక్కడి సినిమాల్లో నటించి ఎంతో పేరుని గడించారు. ఇప్పుడంతా తలక్రిందులై పోయింది. ఎనిమిది కోట్ల ఆంధ్ర ప్రజల్లో పట్టుమని ఓ పదిమంది తెలుగు హీరోయిన్లను కూడా పైకి తీసుకురాలేక పోతున్నాం. ఏమన్నా అంటే, మనదెగ్గర హీరోయిన్లు లేరనే నెపంతో తెలుగు భాష రాని, తెలుగు సాంప్రదాయాల పట్ల అవగాహన లేని బాలీవుడ్ హీరోయిన్‌లని దిగుమతి చేసుకుంటున్నాం. ఎంత సిగ్గు చేటు? ఈ విషపు సాంప్రదాయానికి తెరదించాలసిన సమయం ఆసన్నమైంది. ఆ దిశగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ పెద్ద దిక్కు, ‘దర్శకరత్న’ డా: దాసరి నారాయణ రావు గారు తొలి అడుగులేశారు. పదుల సంఖ్యలో తెలుగు వాళ్ళని నటీ నటులుగా దాసరి గారు తన 149వ చిత్రంగా రూపొందించబడిన “యంగ్ ఇండియా” చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం చేస్తున్నారు. ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరూ తెలుగువారే. ఎవరి పాత్రలకు వాళ్లే డబ్బింగ్ కూడా చెప్పుకున్నారు కూడా. ఎంతో అనుభవం ఉన్న వాళ్ళ లాగా చాలా బాగా నటించారు అందరూ.ఈ సందర్భంగా “యంగ్ ఇండియా” చిత్రం ఈ నెల 15 న విడుదల కానున్న నేపధ్యంలో , ఇందులో నటించిన నటీనటులందరిని ఇటు సినీ పరిశ్రమతో పాటు ప్రేక్షకులకు కూడా ఒకేసారి పరిచయం చేయనున్నారు. అందుకు సంబంధించిన బాధ్యతలను దాసరి తన ప్రియ శిష్యుడైన ప్రముఖ హీరో మోహన్ బాబుకి అప్పగించారు.దాసరిగారు, మోహన్ బాబు ఇద్దరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అన్ని ఛానళ్లలో లైవ్ టెలికాస్ట్ కానున్న ఈ కార్యక్రమం 14 తేదీ సాయంత్రం జరుగుతుంది. ఈ చిత్రం లోని నటీనటులు అందరినీ మీరు కూడా మనస్పూర్తిగా దీవించండి. తెలుగు చలన చిత్ర పరిశ్రమ అనే నౌక ఎప్పుడు మునిగే పరిస్థితుల్లో ఉన్నా, ఆ బరువుని తన భుజాలపైన వేసుకుని జాగ్రత్తగా ఒడ్డుకు చేర్చే బాధ్యతను తీసుకునే దాసరి గారు చేస్తున్న ఈ ప్రయత్నానికి మీ పూర్తి మద్దతును ఆశిస్తూ…. శెలవు.