“అన్న” గారితో నా అనుబంధం
నేను సినిమాల్లోకి రాక ముందు అక్కినేని నాగేశ్వర రావు గారికి అభిమానిని. పౌరాణిక సినిమాలంటే ఎన్టీఆర్ గారి సినిమాలు, సాంఘిక సినిమాలంటే నాగేశ్వర రావు గారి సినిమాలు చూసేవాణ్ణి. నేను సినిమాల్లోకి వచ్చాక ఒక ఇరవై సినిమాలు చేసి బిజీగా ఉన్న స్టేజిలో ఓ రోజు పీతాంబరం గారని ఫేమస్ మేకప్ మన్ నా దెగ్గరికొచ్చారు. ఇప్పటి ప్రముఖ తమిళ దర్శకుడు పి. వాసు వారి అబ్బాయే. అంతే కాకుండా పీతాంబరం గారు అప్పట్లో ప్రముఖ నటులు ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్, జయలలిత లాంటి వాళ్ళకి వ్యక్తిగత మేకప్ మన్. మధ్య మధ్యలో సినిమాలు కూడా నిర్మిస్తూ ఉండేవారాయన. ఆయన నా దెగ్గరికి వక్చి, ఎన్టీఆర్ గారితో నేను ఒక సినిమా చేస్తున్నాను, అందులో మీకో మంచి వేషం ఉంది. రేపు మిమ్మల్ని ఎన్టీఆర్ గారి దెగ్గరికి తీసుకెళ్తాను. మీరు ఆయనకి నచ్చినట్లైతే ఈ సినిమాలో ఆ వేషం మీరే చేస్తారు అని చెప్పి మరునాడు ఉదయం నన్ను ఆయన ఎన్టీఆర్ గారి దెగ్గరికి తీసుకెళ్లారు.
ఎన్టీఆర్ గారు నన్ను చూడటంతోనే రండి బ్రదర్ అని ఆప్యాయంగా పలకరించారు. అప్పటివరకు ఆయన్ని నేను ప్రత్యక్షంగా చూసింది లేదు. మొదటిసారి నిండైన ఆయన విగ్రహాన్ని చూడటంతోనే తెలియని భక్తి భావనతో, ఒక తన్మయత్వంతో వెళ్ళి ఆయన కాళ్లకు దండం పెట్టాను. నా సినీ జీవితంలో నేను కాళ్లకు దండం పెట్టిన మొదటి వ్యక్తి, చివరి వ్యక్తి ఎన్టీఆర్ గారే. అప్పుడు ఆయనే స్వయంగా మా సినిమాలో మంచి వేషం ఉంది బ్రదర్. పేరుకి మేము హీరో కానీ, మాకు హీరోయిన్లు లేరు, డ్యూయేట్లు లేవు. అన్ని మీకు, మా చిన్న తమ్ముడిగా నటిస్తున్న మా బాలయ్య బాబుకే ఉంటాయి. చేయండి మీకు మంచి ప్లస్ అవుతుంది అనడంతోనే నేను పొంగిపోయాను. ఎన్టీఆర్ లాంటి మనిషి నన్ను పిలిచి మరీ వేషం ఇచ్చి చేయమంటే చేయకుండా ఎలా ఉంటాం. అలాగే అన్నగారు చేస్తాను అని చెప్పి సెకండ్ హీరోగా చేశాను. ఆ సినిమా పేరు “అన్నదమ్ముల అనుబంధం”. అప్పట్లో ఆ సినిమా ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. ఆ దెబ్బతో నాకు మరో పది సినిమాల అవకాశాలు వెతుక్కుంటూవచ్చాయి. “అన్నదమ్ముల అనుబంధం” విడుదలయ్యాక నేను ఎక్కడికి వెళ్ళినా ఎన్టీఆర్ గారి తమ్ముడొచ్చాడు అంటూ సంబోధించే వారు. ఆయన పక్కన నటిస్తే వచ్చే గౌరవం అది. ఆ సినిమా తరువాత ఎన్టీఆర్ గారితో చాలా సినిమాలు చూశాను. ఏదేమైనాఆ… ఆయన లాంటి నటుడు కానీ, మనిషి కానీ మళ్లీ పుట్టడు. ఇది నిజం.
July 14th, 2010 at 7:36 am
hello sir,
how are you?
your blog is very nice and good
and
i am fan about your “Leadership”